Pages

ఆలోచనల వెల్లువ.. ఓ కవితాలోచన

మొదలు తుదలు లేనివి
మెదడుని పట్టి తొలిచేవి
మెదడుకు మేత ఇవి
మెదడుకు పట్టిన చెద పురుగులివి

అంతరంగాలివి అనంతతరంగాలవి   
అనంతమైనవి అంతులేనివి
అనుక్షణం వెంటాడుతూ వేధించేవి 

కవిని కదిలించేవి 
కవి హృదయాన్ని గిల్లేవి
కవ్వించేవి కలహించేవి
కలలను కల్పించేవి
కుదురుండనీక కదిపేవి
కాగితాన్ని అక్షరమై అలంకరించేవి
 
భయంకరమైనవి బాధాకరమైనవి
మస్తిష్కంలో లావాను మరిగించేవి
జ్ఞాపకాలను నెమరువేసేవి
వేసవి వెన్నలను కూరిపించేవి
రచనకు ప్రేరేపించేవి
అక్షరం వెనుక అక్షరమై పేజీలను కురుస్తూ పుస్తక మయ్యేవి

ఊసుపోక ఊరికే ఊరించేవి
హాలాహలమై హరించేవి
మనలోనే మనల్ని huntఆడేవి
అవసరంలో hintఆడేవి
ఊహా దాహం తీరనివి
భ్రమల్లో బ్రతికేవి 
భ్రాంతి కలిగించేవి 
ఊహాలోకంలో కి మైగ్రేట్ చేసేవి
మైగ్రేన్ తెప్పించేవి
ఖాళీ బుర్రలో దెయ్యాలివి

నిద్దురను నులిమేవి
మనసుని మీటేవి
మనిషిని మెలివేసెవి
మౌనలోతుల్లో మరుగునపడేవి 

ఆశగా చిగురించేవి
నీరసంగా నిట్టుర్చేవి
వసంతంలా వికసించేవి
నదిలా ప్రవహించేవి
అలల్లా ఎగసిపడేవి

సున్నితమైనవి సన్నిహితమైనవి
ఒంటరితనానికి తోడు ఇవి

విండో సీటు జర్నీలు ఇవి  (వీటి గురించి ఇంకొక పేజీ జర్నీ చేయొచ్చులెండి అందుకే దీనికి ఒక సెపరేటు లైను)

ఇలా ఎన్నో ఎన్నెన్నో మాటకు అందనివి అక్షరానికి దొరకనివి
వాటి వేగానికి అవధులులేనివి
మెదడుని మనసుని football ఆడుకునేవి
మనసుకి మెదడుకి మధ్య మనిషి భావోద్వేగాలివి 
మనిషిని నిద్దురపోనివ్వనివి
ఎంత చించినా చిరగనివి 
ఎంత చెరిపిన చెరగనివి
చాలు అని అనిపించనివి
ఉన్నంతవరకు వదలనివి
మట్టిలో మాత్రమే మాసిపోయేవి

గమనిక: ఈ ఆలోచనల పద్మవ్యూహం కూర్పు ఇంకా  కుదించలేదు, ఆలోచనలు కదా ఆవిర్భావం తప్ప అంతం ఉండదు… అలిసి ఆవలింత వస్తే తప్ప...ఆలోచనలు మాత్రం అలుపులేనివి. 
 
నా ఆలోచనలకి ఆహారం సరిపోక దొరికిన పదాలు అన్నింటినీ వాడేసా ఏమీ అనుకోవద్దు సుమండీ...
మరి మీ దగ్గరున్న  పదాలను కూడా వాడాలని ఉంటే... మీ ఆలోచనా అభిప్రాయలను comments లో వ్యక్తపరచండి.

No comments:

Post a Comment